ఏపీ వికేంద్రీకరణకు సినీ ఇండస్ట్రీ మద్దతు ఇవ్వాలన్న వైస్సార్సీపీ మంత్రి

ఏపీ వికేంద్రీకరణకు సినీ ఇండస్ట్రీ మద్దతు ఇవ్వాలన్నారు వైస్సార్సీపీ మంత్రి గుమ్మనూరు జయరాం. మూడు రాజధానులకు మద్దతుగా… కర్నూలులోని ఎస్‌టిబిసి కాలేజ్‌ గ్రౌండ్‌లో జెఎసి ఆధ్వర్యంలో రాయలసీమ గర్జన సభను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధికార పార్టీ వైస్సార్సీపీ మద్దతు పలికింది. దీంతో ఈ సభ కు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.

ఈ క్రమంలో సభలో మంత్రి జయరాం మాట్లాడుతూ.. సినీ పరిశ్రమకు, కర్నూలుకు మంచి అనుబంధం ఉందని, కర్నూల్ లో హైకోర్టు ఏర్పాటుకు తెలుగు సినీ పరిశ్రమ మద్దతు ఇవ్వాలని కోరారు. కర్నూలులో ఎన్నో సినిమాల షూటింగులు జరుగుతున్నాయని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మద్దతు తెలపాలని విన్నవించారు. కర్నూలు పై ప్రేమ సినిమాలలోనే కాదని, రియల్ గా కూడా చూపించాలన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు బిజెపి మద్దతు ఉందని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్‌ అన్నారు. సీమకు న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ అని, ఇప్పటివరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినా రాయలసీమ ప్రాంతానికి ఎవరూ చేయని పనిని సిఎం జగన్‌ చేశారని ఏపీ బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌ ఓంకార్‌ అన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా తాము ఒప్పుకునేది లేదన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేసేవరకు అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.