గర్జన సభలో సొమ్మసిల్లి పడిపోయిన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

రాయలసీమ గర్జన సభలో వైస్సార్సీపీ యువ నేత, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాథికార సంస్థ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. మూడు రాజధానులకు మద్దతుగా… కర్నూలులోని ఎస్‌టిబిసి కాలేజ్‌ గ్రౌండ్‌లో జెఎసి ఆధ్వర్యంలో రాయలసీమ గర్జన సభను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధికార పార్టీ వైస్సార్సీపీ మద్దతు పలికింది. దీంతో ఈ సభ కు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.

కాగా ఈ సభలో వైస్సార్సీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కళ్లుతిరిగి పడిపోవడంతో అందరు ఆందోళనకు గురయ్యారు. సభలో మాట్లాడిన తరువాత ఆయన ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోయారు. తర్వాత కాసేపటికే తేరుకోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అంతకముందు ఈ సభలో మాట్లాడిన సిద్ధార్ధ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకు భూములిచ్చిన అమరావతివారిది త్యాగమయితే…శ్రీశైలం ప్రాజెక్టు కోసం 55 వేల ఎకరాల భూములిచ్చిన మాది త్యాగం కాదా ? అని ప్ర‌శ్నించారు. మా ప్రాంత అభివృద్ధి కోసం..మా ప్రాంతానికి గుర్తింపు కోసం రాజధానిని కోరుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు భూములిచ్చి రైతులకు ఎంతో త్యాగం చేశార‌ని గుర్తు చేశారు. రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేశార‌ని మండిప‌డ్డారు. అన్ని ప్రాంతాలకు సమానంగా రాయలసీమ అభివృద్ధి చేయాల‌న్న ల‌క్ష్యంతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అడుగులు ముందుకు వేస్తున్నార‌ని, అంద‌రం సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా ఉందామ‌ని, క‌ర్నూలుకు న్యాయ రాజ‌ధానిని సాధించుకుందామ‌ని బైరెడ్డి సిద్ధార్థ‌రెడ్డి పిలుపునిచ్చారు.