భువనేశ్వరి ప్రయాణిస్తున్న విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం..!

విమానం ల్యాండయ్యే ముందు ఆందోళనకర పరిస్థితులు

Nara Bhuvaneshwari

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు అర్ధాంగి నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం కోసం నేడు గన్నవరం చేరుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న ఇండిగో విమానం గన్నవరంలో దిగడానికి ముందు ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చేందుకు నారా భువనేశ్వరి ఇండిగో విమానంలో ప్రయాణించారు. అయితే, ఆ విమానం గన్నవరంలో ల్యాండింగ్ కు ప్రయత్నించగా, వీల్ తెరుచుకోలేదు. దాంతో పైలెట్ ఆ విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లారు.

కొద్దిసేపు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టడంతో ఏం జరుగుతోందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కాసేపటి తర్వాత ల్యాండింగ్ గేర్ తెరుచుకుని వీల్ బయటికి రావడంతో ఇండిగో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నారా భువనేశ్వరికి గన్నవరం ఎయిర్ పోర్టులో మాజీ మంత్రి దేవినేని ఉమా తదితరులు స్వాగతం పలికారు. నారా భువనేశ్వరి నేడు రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయిన అనంతరం మరణించిన టిడిపి కార్యకర్తల కుటుంబాలను పరామర్శించి, వారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు.