గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత

kodali nani
kodali nani

అమరావతిః ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుడివాడ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. గురువారం ఆయన పార్టీ నేతలతో సమావేశమై మాట్లాడుతుండగా ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయారు. గుడివాడ పట్టణంలోని రాజేంద్ర నగర్‌లోని తన నివాసంలో ఆయన నందివాడ మండల పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వారితో మాట్లాడుతుండగా ఉన్నట్టుండి సోఫాలో ఒరిగిపోయారు. అయితే, నానికి జ్వరం రావడంతో నీరసించి అలా జరిగి ఉండొచ్చని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నట్టు నాని ఓ వీడియో రిలీజ్ చేశారు.

కాగా, సుమారు 75 రోజులుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కొడాలి నాని బిజీబిజీగా పాల్గొన్నారు. ఎన్నికలు ముగిసిన అనంతరం గుడివాడలోని తన నివాసంలో ఆయా మండలాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ సరళి, ఇతర వివరాలు తెలుసుకుంటున్నారు. ఇదే క్రమంలో గురువారం (మే 23) నందివాడ మండల వైసీపీ నేతలతో నాని భేటీ అయ్యారు. వారితో చర్చలు జరుపుతుండగానే.. నిల్చొని ఉన్న కొడాలి నాని ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలుస్తోంది. దీంతో నేతలు, ఆయన అనుచరులు ఆందోళనకు గురయ్యారు.