రాజ్యసభ పదవినికి రాజీనామా చేసే ప్రసక్తే లేద : స్వాతి మలివాల్‌

There is no question of resigning from the post of Rajya Sabha: Swati Maliwal

న్యూఢిల్లీః లోక్‌సభ ఎన్నికల వేళ ఢిల్లీలో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్‌ పై దాడి వ్యవహారం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ నెల 13వ తేదీన సీఎం నివాసంలో కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్‌ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో బిభవ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే, ఈ వ్యవహారంతో రాజ్యసభ పదవిని వదులుకోవాలంటూ స్వాతిపై ఒత్తిడి పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఓ లాయర్‌ కోసం స్వాతిని రాజీనామా చేయాల్సిందిగా ఆప్‌ నేతలు ఒత్తిడి తెస్తున్నారంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలపై తాజాగా స్వాతి మలివాల్‌ స్పందించారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

మీడియాతో మాట్లాడిన స్వాతి.. ‘ఎంపీ సీటు కావాలంటే నన్ను అడిగి ఉండాల్సింది. కావాలంటే నా ప్రాణాలైనా ఇచ్చేసేదాన్ని. ఎంపీ సీటు చాలా చిన్న విషయం. నేను ఏ రోజూ పదవుల కోసం ఆశపడలేదు. పార్టీ కోరితే రాజ్యసభకు సంతోషంగా రాజీనామా చేసేదాన్ని. ఇప్పుడు రాజీనామా చేయను. వారు నా క్యారెక్టర్‌ను కించపర్చారు. బీజేపీ ఏజెంట్‌గా ముద్రవేశారు. నేను ఇప్పుడు ఎంపీ పదవి నుంచి తప్పుకోను మరింత కష్టపడి పనిచేస్తా’ అని స్వాతి తేల్చి చెప్పారు.‘2006లో నేను ఎవరికీ తెలియనప్పుడు ఈ వ్యక్తులతో కలిసి పనిచేశాను. ఇంజినీరింగ్ జాబ్ వదులుకుని మరీ వీళ్లతో చేరాను. అప్పట్లో ముగ్గురం మాత్రమే ఉండేవాళ్లం. అప్పటి నుంచి ఎలాంటి పదవులూ ఆశించకుండా పనిచేశా. క్షేత్రస్థాయిలో కూడా పని చేశా. ఇన్నేళ్లల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించా. ఏ పదవీ లేకపోయినా నేను పని చేయగలను. ఇప్పుడు నేను రాజీనామా చేయను’ అని స్వాతి స్పష్టం చేశారు.