అంతర్జాతీయ ప్రయాణికులకు ‘ఎయిర్‌ సువిధ’ నిబంధన ఎత్తివేత

తాజా నిర్ణయం గత అర్ధరాత్రి నుంచి అమలు

govt-eases-corona-vaccination-status-guidelines-for-international-passengers

న్యూఢిల్లీః విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు భారత్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొవిడ్‌ నేపథ్యంలో ‘ఎయిర్‌ సువిధ’ సెల్ఫ్‌ డిక్లరేషన్‌ పత్రాన్ని తప్పనిసరిగా నింపాలన్న నిబంధనను ఎత్తివేసింది. ప్రయాణికులు తమ కరోనా వ్యాక్సినేషన్ వివరాలు, ఎన్ని డోసులు తీసుకున్నారన్న వివరాలు ఆ ఫాంలో పొందుపరిచాలి. అయితే, కేంద్రం ఆ నిబంధనను సడలించింది. ఇకపై అంతర్జాతీయ ప్రయాణికులు ఎయిర్ సువిధ పోర్టల్ లో తమ వ్యాక్సినేషన్ వివరాలు అందజేయాల్సిన అవసరంలేదు. ఈ ఆంక్షలు తొలగిస్తున్నామని, ఈ నిర్ణయం నేటి అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.

కొవిడ్-19 సంక్షోభం తగ్గుముఖం పట్టడం, ప్రపంచవ్యాప్తంగానూ, భారత్ లోనూ వ్యాక్సినేషన్ ముమ్మరంగా జరిగినందున అంతర్జాతీయ ప్రయాణికుల మార్గదర్శకాలు సవరించి, కొత్త మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి ఓ నోటీసు విడుదలైంది. ఇకపై ఏ ప్రయాణికుడు కరోనా వ్యాక్సినేషన్ పై స్వీయ హామీ పత్రం ఇవ్వాల్సిన పనిలేదని కేంద్రం పేర్కొంది. అయితే, కరోనా కేసులు ఎక్కువైతే ఈ నిబంధన మళ్లీ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/