పెండింగ్‌ బిల్లులుపై గవర్నర్‌ తమిళిసై కీలక నిర్ణయం

ఒకదాన్ని తిరస్కరించిన గవర్నర్‌ తమిళిసై

governor-tamilisai-soundararajan-key-decision-on-peddling-bills

హైదరాబాద్: పెండింగ్‌ బిల్లులపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పలు బిల్లులకు ఆమోదం తెలిపిన గవర్నర్‌.. తాజాగా తన వద్ద ఉన్న మరికొన్ని బిల్లుల్లో ఒకదాన్ని తిరస్కరించగా.. మిగతావాటిపై ప్రభుత్వ వివరణ కోరారు. ప్రభుత్వం ఆమోదించి తన వద్దకు పంపిన డీఎంఈ పదవీ విరమణ వయసు పెంపు బిల్లును ఆమె తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరిన వాటిలో పురపాలక నిబంధనల చట్ట సవరణ, ప్రైవేటు వర్సిటీల చట్ట సవరణ బిల్లులు ఉన్నాయి. గవర్నర్‌ ఇప్పటికే 3 బిల్లులను ఆమోదించగా, మరో రెండింటిని పరిశీలన, ఆమోదం కోసం రాష్ట్రపతి వద్దకు పంపించారు.

కాగా, గవర్నర్ బిల్లులను ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏప్రిల్ 24 సోమవారం రోజున దీనిపై విచారణ జరగనుంది. ఈనేపథ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం గవర్నర్ దగ్గర ఎలాంటి పెడింగ్ బిల్లులు లేదని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. మొత్తం 10 బిల్లులకు గాను 3 ఆమోదించగా,2 రాష్ట్రపతి పరిశీలనకు, మరో రెండు వెనక్కి పంపారని, మూడు పెండింగ్ లో ఉన్నట్లుగా వెల్లడించారు.