గవర్నర్ వరంగల్ పర్యటనలో మరోసారి ప్రోటోకాల్ వివాదం

తెలంగాణ గవర్నర్ తమిళసై పర్యటనలో మరోసారి ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఈరోజు వరంగల్ లోని కాకతీయ యూనివర్శిటీలో జరిగిన 22వ స్నాతకోత్సవంలో ఆమె పాల్గొన్నారు. 2019-20 విద్యాసంవత్సరంలో వివిధ కోర్సుల్లో పీహెచ్డీ చేసిన 56 మందికి డాక్టరేట్ పట్టాలను ప్రదానం చేసి, మరో 276 మందికి గోల్డ్ మెడల్స్ అందించారు. అయితే ఈసారి కూడా గవర్నర్ పర్యటనలో అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు. గవర్నర్ కు స్వాగతం పలికేందేకు కలెక్టర్ రాజీవన్ హన్మంత్, వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి హాజరు కాకపోవడం చర్చనీయంశంగా మారింది. దీంతో కేయూ గెస్ట్ హౌజ్ దగ్గర RDO వాసుచంద్ర, డీసీపీ స్వాతగం పలికారు.

అయితే గవర్నర్ ప్రోటోకాల్ గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు క్రియేటివ్ గా ఆలోచించాలన్నారు. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు పోవాలన్నారు. ఆన్ రైడ్ ను పక్కకు పెట్టి.. ప్రకృతిని ఆస్వాదించాలన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలని చెప్పారు. లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ.. వ్యక్తిత్వ వికాసం సాధించాలన్నారు. మహిళలు సాధారణ కోర్సులు కాకుండా.. వృత్తి పరమైన మెడికల్ కోర్సుల విద్యను అభ్యసించాలన్నారు. ఇక గవర్నర్ తమిళిసై రోడ్డు మార్గంలోనే వరంగల్ కు వెళ్లడం జరిగింది. కార్యక్రమం అనంతరం కూడా రోడ్డు మార్గంలోనే ఆమె హైదరాబాద్ కు తిరిగిరానున్నారు.