రాజాసింగ్ ను జైలుకు పంపాలంటూ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఫై కేసులు నమోదు చేసి జైలుకు పంపాలంటూ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. రాజాసింగ్ విడుదల చేసిన వీడియో వల్ల ముస్లింల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. మహమ్మద్ ప్రవక్తపై ఆయన అభ్యంతర వ్యాఖ్యలు చేశారన్న ఓవైసీ.. అందువల్లనే పాతబస్తీలో నిరసనలు వెల్లువెత్తాయన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని ఆయన తెలిపారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో.. బీజేపీ వల్ల నగరంలో అశాంతి నెలకొందని విమర్శించారు. రాజాసింగ్ పై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. ఒక ప్రజా ప్రతినిధి అయి ఉండి రాజా సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఇలాంటి కామెంట్లు చేయకుండా ఉండాలంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఇదిలా ఉంటె రాజాసింగ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీఆర్పీసీ 41(ఏ) కింద ఆయనకు షాహినాయత్ గంజ్, మంగళ్ హాట్ పోలీసులు నోటీసులు అందించారు. అయితే, పోలీసుల తీరుపై రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత కేసుల్లో తనను అరెస్టు చేసేందుకు కుట్ర పన్నారని అన్నారు. ఈ నోటీసులను నిన్ననే సిద్ధం చేశారని, ఈరోజు తనకు అందించారని అన్నారు. కేసులు నమోదైన ఆరు నెలల నుంచి పోలీసులు ఏం చేశారని ఆయన నిలదీశారు. ఈ నోటీసులపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని పోలీసులు ఆదేశించారు. అయితే తెలంగాణ పోలీసులు తనను ఈరోజు అరెస్ట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.