ప్రవళిక మృతిపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలిః గవర్నర్ ఆదేశాలు

governor-tamilisai-ordered-to-give-a-report-on-pravallika-death-within-48-hours

హైదరాబాద్‌ః గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రవళిక మృతిపై నలభై ఎనిమిది గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీ, టీఎస్‌పీఎస్సీ కార్యదర్శిని గవర్నర్ ఆదేశించారు. మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభుతి తెలిపారు. పోటి పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత ఎదుర్కొంటున్న సవాళ్లు, లోనవుతున్న ఒత్తిళ్లను ప్రవళిక మరణం మరోసారి గుర్తు చేసిందని గవర్నర్‌ తెలిపారు. నిరుద్యోగ యువత నిరాశకు లోను కావద్దని, సాధనలో వారికి పూర్తి అండగా నిలుస్తానన్ని గవర్నర్‌ తెలిపారు.

కాగా, గ్రూప్-2కు ప్రిపేర్ అవుతున్న ప్రవల్లిక రాసిన సూసైడ్ నోట్ కన్నీళ్లు తెప్పిస్తోంది. ‘నన్ను క్షమించండి అమ్మా! నేను చాలా నష్టజాతకురాలిని. నావల్ల మీరు బాధపడుతూనే ఉన్నారు. ఏడవకండి అమ్మా. జాగ్రత్తగా ఉండండి. మీకు పుట్టడం నా అదృష్టం. నన్ను కాళ్లు కింద పెట్టకుండా చూసుకున్నారు. మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా. నన్ను ఎవరూ క్షమించరు. మీ కోసం నేను ఏం చేయలేకపోతున్నా’ అని లేఖ రాసి తనువు చాలించింది.