రాజ్‌భవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించిన గవర్నర్‌ తమిళిసై

రాజ్‌భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జాతీయ పతాకాన్నిగవర్నర్‌ తమిళిసై ఆవిష్కరించారు. అనంతరం సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుమందు సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగులో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్‌ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది. మేధావులు, మహోన్నత వ్యక్తులు మన రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగ రచనలో డాక్టర్ బీఆర్.అంబేడ్కర్‌ ఎంతో అంకితభావం కనబరిచారు. ఆ రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని అన్నారు. తెలంగాణకు ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉందన్నారు. శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోందన్నారు.

వైద్యం, ఐటీ రంగాల్లో భాగ్యనగరం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని.. దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్‌ అనుసంధానమై ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సహకారాన్ని రాజ్‌భవన్ అందిస్తోందన్నారు. గిరిజన ప్రాంతాల్లో రాజ్‌భనన్‌ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని.. వారిలో పోషకాహార సమస్య నివారణకు కృషి చేస్తుందని గవర్నర్‌ తమిళిసై వెల్లడించారు. కొంతమందికి నేను నచ్చకపోవచ్చు..కొందరికి నచ్చకపోయినా తెలంగాణ అభివృద్ధికి కృషిచేస్తానంటూ కామెంట్ చేశారు. రాష్ట్రాభివృద్ధికి రాజ్‌భవన్ సహకారం అందిస్తోందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో తన పాత్ర తప్పక ఉంటుందన్నారు. కొత్త భవనాలు నిర్మించడం మాత్రమే అభివృద్ధి కాదని.. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడదామంటూ పిలుపునిచ్చారు గవర్నర్. అనంతరం ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సినీ గేయరచయిత చంద్రబోస్‌, బాలలత, ఆకుల శ్రీజతోపాటు పలువురిని గవర్నర్‌ తమిళిసై సన్మానించారు.