రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదీ ముర్ము ఘన విజయం..

రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపదీ ముర్ము ఘన విజయం సాధించారు. 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. అంత ఊహించినట్లుగానే ప్రత్యర్థి యశ్వంత్​ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు. మూడో రౌండ్ ముగిసే సరికి స్పష్టమైన ఆధిక్యం లభించింది.

మూడో రౌండు కౌంటింగ్ పూర్తయ్యే సరికి ద్రౌపది ముర్ము 50శాతానికి పైగా ఓట్లు సాధించారు.ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో దిగిన ద్రౌపది ముర్ము ప్రతి రౌండ్ లోనూ ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై ఆధిక్యం ప్రదర్శించారు. జులై 25న ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పీఠం అధిరోహించనున్నారు. ఈ విజయంతో ముర్ము.. రాష్ట్రపతి పీఠమెక్కే తొలి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించారు. 64 ఏళ్ల ద్రౌపదికి.. ఒడిశా మంత్రిగా, ఝార్ఖండ్​ గవర్నర్​గా సేవలు అందించిన అనుభవం ఉంది.

ఈ నెల 18న ఓటింగ్ నిర్వహించగా.. ఈ రోజు ఉదయం 11 గంటలకు పార్లమెంటు హౌస్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి రౌండ్​లో మొత్తం 748 మంది ఎంపీల ఓట్లను లెక్కించారు. ద్రౌపది.. 3,78,000 విలువైన 540 ఓట్లు దక్కించుకున్నారు. సిన్హాకు 1,45,600 ఓట్లు పడ్డాయి. 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకుండా పోయాయి.

సెకండ్ రౌండ్​లో ఆంధ్రప్రదేశ్​ సహా మొత్తం 10 రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల ఓట్లు(1138 ఓట్లు, 1,49,575 విలువ) లెక్కించారు. ముర్ముకు 809 ఓట్లు(విలువ 1,05,299) దక్కాయి. సిన్హాకు 44,276 విలువైన 329 ఓట్లు పడ్డాయి.మూడో రౌండ్‌ ముగిసే సమయానికి ద్రౌపదీ ముర్ము 50శాతం మార్కును దాటారు. మూడో రౌండ్‌లోనూ ద్రౌపదీముర్ముకు ఆధిక్యాన్ని కనబర్చారు. మూడో రౌండ్‌లో ముర్ముకు 2,161 ఓట్లు, యశ్వంత్ సిన్హాకు 1,058 ఓట్లు పోలయ్యాయి. దీంతో ద్రౌపదీముర్ముకు పోలైన మొత్తం ఓట్ల విలువ 5,77,777 కాగా.. యశ్వంత్‌ సి‌న్హాకు పోలైన మొత్తం ఓట్ల విలువ 2,61,062.

ముర్ము విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని మోడీ ఆమెతో భేటీ కానున్నారు. రాష్ట్రపతిగా విజయం సాధించిడంపై ఆమెను అభినందించనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, బిజెపి చీఫ్​ జేపీ నడ్డా సహా పలువురు నేతలు కూడా ముర్మును కలిసే అవకాశం ఉంది.