రైతులకు తీపి కబురు తెలిపిన కేంద్రం

రైతులకు కేంద్రం తీపి కబురు తెలిపింది. ఖరీఫ్‌లో పంటల మద్దతు ధరలను అమాంతం పెంచి వారిలో ఆనందం నింపింది. 17 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)లను పెంచుతూ కేంద్ర క్యాబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి క్వింటాలు వరికి మద్దతు ధర రూ.1940. ఇప్పుడు దాన్ని మరో వంద రూపాయలు పెంచి, రూ.2040కి చేర్చారు. ఏ గ్రేడ్ వరికి మద్దతు రూ.2060 వరకు ఇస్తామని కేంద్రం వెల్లడించింది.

అలాగే పత్తి మద్దతు ధరను రూ.5,726 నుంచి రూ.6080కు..పొడవు పత్తి రకానికి రూ.6,025 నుంచి రూ.6,380కు పెంచింది. పెసర్లకు రూ.400, పొద్దు తిరుగుడుపై రూ.385, సోయాబీన్‌పై రూ.300, నువ్వులపై రూ.523 పెంచింది. కందులపై క్వింటాల్‌కు మద్దతు ధర రూ.300 పెంచింది. దీంతో పాటు కందులకు రూ.6600, పెసర్లకు రూ.7,755, మినుములకు రూ.6,600, వేరుశనగ రూ.5,850 చెల్లించనున్నారు.

ఖరీఫ్, రబీ సీజన్ లో ఎరువుల అవసరాలను తీర్చడానికి దేశంలో తగినన్ని యూరియా నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. డిసెంబరు దాకా యూరియాను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు తగ్గాయని, రానున్న 6 నెలల్లో వాటి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని చెప్పారు. రైతులకు లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే సరసమైన ధరలకు ఎరువులను అందుబాటులో ఉంచేలా సబ్సిడీని పెంచినట్లు వివరించారు.