మరోసారి బస్సు చార్జీలు పెంచిన టీఎస్ ఆర్టీసీ..

tsrtc once again fares hike in the state

ఇప్పటికే రెండు సార్లు చార్జీలు పెంచిన టీఎస్ ఆర్టీసీ..ముచ్చటగా మూడోసారి పెంచింది. గతంలో రౌండప్, టోల్ ప్లాజాలు, ప్యాసింజర్స్ సెస్ పేరుతో చార్జీలు పెంచిన టీఎస్ ఆర్టీసీ.. ఇక ఇప్పుడు కిలోమీటర్ల వారీగా డీజిల్ సెస్ పేరుతో ప్రయాణికులపై మరోసారి చార్జీల భారం మోపింది. కనిష్ట, గరిష్ట దూరాన్ని బట్టి డీజిల్ సెస్ వసూలు చేసేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. అన్నిరకాల బస్సుల్లో దూరాన్ని బట్టి రేపటి నుంచి డీజిల్ సెస్ వసూలు చేయనుంది. ఇందులో జీహెచ్ఎంసీని మినహాయించింది. పెంచిన చార్జీలు రేపటి నుంచే అమల్లోకి రానున్నాయి. ప‌ల్లె వెలుగు బస్సుల్లో 250 కి.మీ. దూరానికి ప్రస్తుతం ఈ సెస్ (Diesel Cess) రూ.5 ఉండగా.. దీన్ని రూ.45కు పెంచినట్లు తెలుస్తోంది. ఎక్స్ ప్రెస్‌ బస్సుల్లో 500 కి.మీ. దూరానికి ఈ సెస్ రూ.5 నుంచి రూ.90కి పెంచారు. డీల‌క్స్‌ బస్సుల్లో 500 కి.మీ దూరానికి రూ.5 నుంచి రూ.125కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

సూపర్‌ లగ్జరీ బస్సుల్లో కనీస దూరానికి రూ.10లు, 500 కిలోమీటర్ల వరకు రూ.130 డీజిల్‌ సెస్‌ రూపంలో వసూలు చేయనున్నారు. ఏసీ సర్వీసుల్లో కనీస దూరానికి రూ.10, 500 కిలోమీటర్ల వరకు రూ.170 డీజిల్‌ సెస్‌ రూపంలో వసూలు చేయనున్నారు. ఇంధన ధరలు భారీగా పెరిగిన కారణంగా డీజిల్ సెస్ పెంచుతున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. అయితే, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం డీజిల్ సెస్ పెంపులేదని టీఎస్‌ఆర్టీసీ వర్గాలు స్పష్టం చేశాయి. గ్రేటర్ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇది కాస్త ఊరటనిచ్చే అంశం. ఇకఇప్పటికే పెంచిన చార్జీల పట్ల ప్రయాణికుల నుండి వ్యతిరేకత వస్తుండగా..రేపటి నుండి మరోసారి చార్జీలు పెరుగుతుండడం తో ఎలా రియాక్షన్ ఇస్తారో చూడాలి.