సీతారామరాజు జిల్లాలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. కిరండోల్‌-విశాఖ మార్గంలోని శివలింగపురం రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బచేలి నుంచి విశాఖకు ముడి ఇనుముతో వెళ్తున్న గూడ్స్ రైలు శివలింగపురం ఏడో టన్నెల్‌ వద్ద పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 8 బోగీలు పక్కకు ఒరిగాయి.

బోగీలు పడిపోవడంతో పట్టాల పక్కన ఉన్న కొన్ని విద్యుత్‌ స్తంభాలు దెబ్బతిన్నాయి. గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో విశాఖ నుంచి కిరండోల్‌ వెళ్లే ప్యాసింజర్‌ రైలును అధికారులు రద్దు చేశారు. రైల్వే డీఆర్‌ఎం సత్పతి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. రైల్వే సిబ్బంది ట్రాక్‌ పనులను పునరుద్ధరిస్తున్నారు. పూర్తిస్థాయిలో ట్రాక్‌ పునరుద్ధరణకు 36 గంటలు పట్టే అవకాశముందని రైల్వే సిబ్బంది తెలిపారు.