సద్వినియోగం – సంతృప్తి

vaartha devotional stories
om

వివేకవంతుడైన మానవుడు ఉత్తమ మార్గాలలో నడిచినంతకాలం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. సందర్భాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. సంపదను సద్వినియోగం చేసుకుంటూనే తన సేవలను సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని తోటివారికి సమాజానికి కలుగచేస్తాడు. జీవితంలో సద్వినియోగమంటే అన్ని వేళలా స్వప్రయోజనాన్ని అంచెలంచెలుగా పెంచుకోవడం మాత్రమే కాదు. అవసరమైన వారికి అవకాశమున్న ప్రతిసారి చేతనైనంతలో చేయూతనిందించడం, ఆపదలో చిక్కుకున్న వారికి ఆత్మబంధువై అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చెయ్యగలిగేదే సద్వినియోగం తాలూకు సత్ఫలితం. ఎంతసేపూ తన సంపదకు తన విద్యకు తన స్థాయికి ప్రాముఖ్యం కోరుకునే మానవ్ఞడు తన ఆత్మసాక్షికి అనుగుణంగానే నడుచుకుంటున్నాడా? అత్యధిక సందర్భాల్లో లేదన్న సమాధానం నిర్వివాదాంశం.

మరి సమాజంలో చోటు చేసుకుంటున్నదేమిటి? తనకు తానుగా నచ్చే రీతిలో సమాజం మెచ్చుకునే తీరులో ఉండలేని వాడు తన ఇష్టాఇష్టాలను సమాజంపైన రుద్దాలని ఎందుకు చూస్తున్నాడు? బుద్ధిహీనత, జ్ఞానహీనత గుణహీనతల ప్రధాన కారణం. ఎన్ని చదివినా, ఎన్ని విన్నా హీనుడు చెడుగుణాన్ని వీడలేడు. సహనమున్న మనసే సర్వసంపదల స్థావరమని గ్రహించలేడు. నిత్యజీవితంలో సహనమ అమూల్యమైన ఆభరణమని, సహనమే విశేష ఫలితాలను అందచేస్తుందని అర్ధం చేసుకోలేడు.

ఇక సామరస్యానికి చోటెక్కడ? అదే లేనప్పుడు ఎంతటి కఠిన సమస్యలకైనా సమాధానాలుంటాయని, పెను సవాళ్లకు సైతం జవాబులుంటాయని ఎలా గ్రహించగలుగుతాడు? గతంలేక వర్తమానం, వర్తమానంలేక భవిషయత్తు లేదన్నమాట నిజమే కానీ అస్తమానం గతంలోకి తొంగి చూడటమో, భవిష్యత్తు గురించి కలలు కనడమో సద్వినియోగమనిపించుకోదు. అవసరమేదో అనవసరమేదో గుర్తించగలిగితే ఆడంబరాలు అన్ని వేళలా అనర్ధదాయకమేనని తెలుసుకోగలిగితే వర్తమానమెప్పుడూ సద్వినియోగమే భవితకది నిస్సందేహంగా బంగారుబాటే.

ఈ విషంలో ఎవరికెటువంటి అనుమానాలుండవన్నది ఎంత నిజమో, పులిని చూసి వాతలు పెట్టుకునే నక్కబుద్ధిని మానవ్ఞడు అంత తేలిగ్గా వీడలేడన్నది అంతే నిజం.నిజమంత నిష్టూరంగా అనిపించినపుడు మనిషిలో మమతానురాగాలు చిగురిస్తే తప్ప జీవితంలో సద్వినియోగమనే మాటకు సార్థకత చేకూరదు. ఆ కోణంలో కులమతాలకు, సిరిసంపదలకు విద్యార్హతలకు అతీతంగా ఆలోచిస్తున్నవారెందరు?

మనసు మంచిదైతే ప్రతి ఒక్కరూ హితపరులుగానే కనిపిస్తారని విశాల విశ్వం వసుదైక కుటుంబంగా అనిపిస్తుందని మానవ్ఞడెందుకు ఆలోచించలేకపోతున్నాడు? తానెన్నో సదాశయాలతో ముందుకెళ్లాలనుకుంటున్నా అడుగడుగునా అవరోధాలు అవహేళనలు ఎదురవ్ఞతున్నాయని, ఫలితంగా తన సమయాన్ని ఆలోచనల్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నట్లు ఎటు చూసినా దుర్మార్గం పెత్తనం చేస్తున్నట్లు అదే ఆలోచనలతో సతమతం కావడమంటే విలువైన సమయాన్ని వృధా చేస్తున్నట్లే కదా! మనిషి కేవలం తన కోసం తాను కాక తన విలువైన సమమంలో అమూల్యమైన మాటల్లో తన సంపదలో తన సేవలో కొంతైనా నిస్వార్ధంగా ఏ కొద్ది మందికి అందించగలిగినా కలిగే సంతృప్తి సంతోషం సమాజంలోని ఏ కొలమానాలకు అందనిది. అందమైన జీవితంలో సద్వినియోగం అన్న పదానికి ఇంత కన్న సార్ధకత మరేముంటుంది.

-ఉలాపు బాలకేశవులు

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండి: https://epaper.vaartha.com/