వారం రోజులు ముందుగానే నైరుతి వానలు

రైతులకు గుడ్ న్యూస్ తెలిపింది వాతావరణ శాఖ. ఈసారి వారం రోజులు ముందుగానే నైరుతి వానలు పడబోతున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్ కన్నా ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉంది. మే 31నే నైరుతి రుతుపవనాలు రానున్నట్లు I.M.D. వెల్లడించింది. వాతావరణశాఖ తెలిపిన చల్లని కబురుతో రైతుల ముఖంలో వెలుగులు నిండాయి. ఇప్పటికే పంటపొలాలను సిద్ధం చేసుకుని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. మనదేశంలో నైరుతి రుతుపవనాల వల్లే విస్తరంగా వర్షాలు కురుస్తాయి. వర్షాధార పంటలకూ ఇవే ఆధారం. దేశంలో జూన్, జులై నెలలో పడే వర్షాలే అత్యంత కీలకం.

సాధారణంగా నైరుతి రుతుపవనాలు కొంచెం అటు, ఇటుగా జూన్ తొలివారంలోనే దేశంలోకి ప్రవేశిస్తాయి. గతేడాది జూన్ 8న రాగా…ఈసారి వారం రోజులు ముందుగానే పలకరించనున్నాయి. ఇటు తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వరంగల్, గద్వాల, హనుమకొండ, నారాయణపేట జిల్లాలో వర్షాలు పడతాయని తెలిపింది. ఏపీలో నేడు మన్యం, అల్లూరి, అనకాపల్లి, కృష్ణ, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA ప్రకటించింది.