పంజ్‌షిర్‌పై ఎగిరిన తాలిబన్ల జెండా

panjshir-resistance-forces-call-for-ceasefire-seek-immediate-end-to-war-with-taliban

కాబూల్‌: పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌పై పట్టు సాధించేందుకు జరుగుతున్న పోరులో తాలిబన్లు పైచేయి సాధించారు. మొత్తం ప్రాంతమంతా వాళ్ల ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం అధికారికంగా తాలిబన్లు ఈ విషయాన్ని ప్రకటించుకున్నారు. ప్రావిన్షియ‌ల్ గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం ముందు తాలిబ‌న్ నేత‌లు నిల్చున్న ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వారి వెనుకే తాలిబ‌న్ జెండా కూడా క‌నిపిస్తోంది.

ఇన్నాళ్లూ తాలిబ‌న్ల‌ను తీవ్రంగా ప్ర‌తిఘ‌టించిన తిరుగుబాటు సేన‌లు.. మొత్తానికి త‌ల‌వంచాయి. ఈ యుద్ధంలో నార్త‌ర్న్ అల‌యెన్స్ క‌మాండ‌ర్ ఇన్ చీఫ్ స‌లే మ‌హ్మ‌ద్‌ను కూడా తాము మ‌ట్టుబెట్టిన‌ట్లు తాలిబ‌న్లు ప్ర‌క‌టించుకున్నారు. అయితే తాలిబ‌న్లు చెబుతున్న‌ద‌న్నదంతా అబద్ధ‌మ‌నీ.. పంజ్‌షిర్ ఇంకా త‌మ ఆధీనంలోనే ఉన్న‌ద‌ని తిరుగుబాటు సేన‌లు చెబుతుండ‌టం గ‌మ‌నార్హం. పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ కూడా తాలిబ‌న్ల‌కు స‌హ‌క‌రిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

కాగా, పంజ్‌షిర్‌ను పూర్తిగా త‌మ ఆధీనంలోకి తీసుకున్న‌ట్లు తాలిబ‌న్ల అధికార ప్ర‌తినిధి జ‌బీహుల్లా ముజాహిద్ వెల్ల‌డించారు. గ‌త నెల 15నే ఆఫ్ఘ‌నిస్థాన్ మొత్తం తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిపోగా.. పంజ్‌షిర్ ప్రావిన్స్ మాత్ర‌మే వారిపై తిరుగుబాటు చేసిన విష‌యం తెలిసిందే. ఆ దేశ మాజీ ఉపాధ్య‌క్షుడు అమ్రుల్లా స‌లేహ్ కూడా అక్క‌డి తిరుగుబాటుదారుల‌తో చేతులు క‌లిపారు. అయితే తాలిబ‌న్లు పంజ్‌షిర్‌పై దాడి చేసిన త‌ర్వాత అమ్రుల్లా దేశం విడిచి పెట్టి వెళ్లిపోయారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/