పబ్జీ ఫ్యాన్స్‌కు ఇక పండగే!

భారత్‌లో పబ్జీ గేమ్‌కు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాగా ఈ ఆటను చిన్నా, పెద్దా తేడా లేకుండా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరు ఆడేందుకు ఇష్టపడుతుంటారు. అయితే సౌత్ కొరియాకు చెందిన పబ్జీ కార్పోరేషన్‌కు చెందని పబ్జీ మొబైల్ గేమ్‌ను చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ కంపెనీ నిర్వహించేది. కాగా ఇటీవల చైనా దేశం నిర్వహిస్తున్న పలు యాప్‌లను భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.

భారతీయుల డేటాను చైనా దేశం దుర్వినియోగం చేస్తుందనే కారణంతో ఆ దేశానికి చెందిన 59 యాప్‌లను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ జాబితాలో పబ్జీ గేమ్ కూడా ఉండటంతో, ఈ గేమ్‌ను ఆడేవారు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కాగా పబ్జీ గేమ్‌ను బ్యాన్ చేసిన నాటికి, దాన్ని ఇన్‌స్టా్ల్ చేసుకున్న వారు ఆడుకునే వీలుండేది. కానీ అక్టోబర్ 30 నుండి ఈ గేమ్‌ను పూర్తిగా నిషేధించారు. దీంతో ఇప్పుడు పబ్జీ గేమ్‌ను తిరిగి ఇండియాలోకి తీసుకొచ్చేందుకు పబ్జీ కార్పొరేషన్ సిద్ధమవుతోంది. భారత్‌లో పబ్జీ నిర్వాహణా బాధ్యతలను చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ నుండి విత్‌డ్రా చేసుకొని, భారత ప్రభుత్వం ఆరోపిస్తున్న యూజర్ డేటా స్టోరేజీని స్థానిక సర్వర్లలో స్టోర్ చేసేందుకు ఆ కంపెనీ ఆసక్తి చూపుతోంది.

దీంతో ఈ ఏడాది చివరినాటికి తిరిగి భారత్‌లో పబ్జీ గేమ్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు పబ్జీ కార్పొరేషన్ తెలిపింది. మరి ఈసారి పబ్జీ గేమ్‌ను ఇండియాలో నిర్వహించే బాధ్యతను ఏ కంపెనీకి అప్పగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా పబ్జీ గేమ్ లవర్స్‌కు ఇది గుడ్ న్యూస్ అని ఖచ్చితంగా చెప్పాలి.