హమ్మయ్య గోదావరి ఉదృతి తగ్గుతుంది

భద్రాచలం వద్ద గోదావరి వరద ఉదృతి తగ్గుతుండడం తో అంత ఊపిరి పీల్చుకుంటున్నారు. నిన్న రాత్రి 70 అడుగుల మేర ప్రవహించడం..75 అడుగుల వరకు చేరే అవకాశం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం కావడం తో లోతట్టు ప్రజలే కాదు పట్టణవాసులు , ప్రభుత్వం సైతం ఖంగారు పడ్డారు. కానీ గోదావరి వరద ఉదృతి మాత్రం తగ్గుముఖం పడుతుంది. నిన్న 70 అడుగుల మేర ఉండగా..ఈరోజు సాయంత్రం నాటికీ 69 అడుగులకు చేరింది. ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు లేకపోవడంతో గోదావరికి వరద తగ్గింది.

కాకపోతే ముంపు గ్రామాల్లో మాత్రం నీరు అలాగే ఉండడంతో వారంతా ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క మూడు రోజులుగా కరెంట్ లేకపోవడం తో మరింత ఇబ్బంది పడుతున్నారు. వందల గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు దెబ్బతిన్నాయి. దుమ్ముగూడెం, చర్ల మండలాలకు ఈ సమస్య తీవ్రస్థాయిలో తలెత్తడంతో సమాచార వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. సుమారు 200 గ్రామాలకు మండల కేంద్రాలతో సంబంధాలు తెగిపోయాయి. ప్రజా, రవాణా, సమాచార వ్యవస్థలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

ఇదిలా ఉండగానే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలంగాణ లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడబోతున్నాయనే వార్త తెలిపి షాక్ ఇచ్చింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో రేపు, ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.