కేంద్రం కక్షపూరిత వైఖరిపై పార్లమెంట్‌లో గళం విప్పాలని ఎంపీలకు సూచించిన సీఎం కేసీఆర్

సోమవారం నుండి పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో టిఆర్ఎస్ అధినేత , తెలంగాణ రాష్ర ముఖమంత్రి కేసీఆర్..శనివారం ప్రగతిభవన్‌లో లోక్‌సభ ఎంపీలు, రాజ్యసభ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహంపై కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం పట్ల కేంద్రం కక్షపూరిత వైఖరిపై ఉభయసభల్లో గళం విప్పాలని ఎంపీలకు సూచించారు. కేంద్రంపై పోరాటానికి పార్లమెంటు ఉభయ సభలనే వేదికలుగా మలుచుకోవాలని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి నిలిచిపోతున్న నేపథ్యంలో, సోయి ఉన్న తెలంగాణ బిడ్డలుగా, భారత పౌరులుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు పార్లమెంట్ ఉభయ సభలనే సరైన వేదికలుగా మలుచుకోవాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఆర్ధిక క్రమశిక్షణతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను మోడీ ప్రభుత్వం ఏనాడూ ప్రోత్సహించకపోగా, అభివృద్ధిని అడ్డుకునే కుట్రలకు పాల్పడుతున్నదని సీఎం కేసీఆర్ దుయ్యబట్టారు.
నిబంధనల పేరిట ఆర్థికంగా అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలు బిజెపి సోషల్ మీడియా గ్రూపులకు ఎలా చేరుతున్నాయో సమాధానం చెప్పాలన్నారు. దేశం, రాష్ట్రం మధ్య గోప్యంగా ఉండాల్సినవి లీక్ చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవహారాలను లీక్ చేయడం నేరపూరిత చర్యగా అభివర్ణించారు. దేశంలోని 22 రాష్ట్రాల అప్పులు తెలంగాణ కన్నా ఎక్కువగా ఉన్నాయని ఎంపీలకు సీఎం వివరించారు. ఎనిమిదేళ్లలో ఎన్నడూ ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాకుండా తిరిగి చెల్లించిన ట్రాక్ రికార్డు తెలంగాణ సొంతమని వెల్లడించారు. ఆర్బీఐ వేసే బిడ్లలో తెలంగాణకే ఎక్కువ డిమాండ్ పలుకుతున్న విషయం వాస్తవం కాదా అని కేంద్రాన్ని కేసీఆర్ ప్రశ్నించారు.