ఫ్రాన్స్‌ నుంచి భారత్‌కు రెండు మిరాజ్‌ 2000 యుద్ధ విమానాలు

న్యూఢిల్లీ : ఫ్రాన్స్‌ నుంచి భారత్‌కు రెండు మిరాజ్‌ 2000 యుద్ధ విమానాలు చేరాయి. భారత యుద్ధ విమానాల సముదాయాన్ని బలోపేతం చేసేందుకు ఫ్రాన్స్‌ వినియోగించిన వీటిని ఐఏఎఫ్‌ కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో రెండు మిరాజ్‌ 2000 యుద్ధ విమానాలు వైమానిక దళంతో కలిసి ప్రయాణించి గ్వాలియర్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నాయని ప్రభుత్వ వర్గాలు ఏఎన్‌ఐకి తెలిపాయి. మిరాజ్ ఫైటర్ ఫ్లీట్‌లోని విమానాల సంఖ్యను 50కి చేర్చే కార్యక్రమంలో భాగంగా ఈ రెండు పాత ఫ్రెంచ్ విమానాలను భారత వైమానిక దళం కొనుగోలు చేసింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో జరుగుతున్న మిరాజ్ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ విమానాలను అప్‌గ్రేడ్ చేస్తారని ప్రభుత్వ వర్గాలు వర్గాలు తెలిపాయి.

ఐఏఎఫ్‌ వివిధ బ్యాచ్‌ల కింద సుమారు 51 మిరాజ్‌లను సమకూర్చుకున్నది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో మూడు స్క్వాడ్రన్‌లను ఏర్పాటు చేసింది. కాగా, 51 విమానాల సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం ఫ్రెంచ్, భారత్‌ మధ్య మిరాజ్ అప్‌గ్రేడ్ ఒప్పందం కుదిరింది. అయితే ఈ విమానాల క్రాష్‌ కారణంగా కొన్ని కిట్‌లు మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు ఫ్రెంచ్ వైమానిక యుద్ధ విమానాలకు ఆ కిట్‌లను వినియోగించి యుద్ధ కార్యకలాపాలకు అనువుగా వాటిని తయారు చేస్తారని ప్రభుత్వ అధికారులు తెలిపారు. మిరాజ్‌ల విడిభాగాలను దశలవారీగా పాత ఫ్రెంచ్ విమానాల ద్వారా సేకరించడంలో భారతీయ వైమానిక దళం చాలా తెలివిగా వ్యవహరించి పెట్టుబడి పెట్టిందని చెప్పారు. దీంతో 2035 వరకు మిరాజ్‌లను నిర్వహించడానికి వైమానిక దళానికి ఇది సహాయపడుతుందని వెల్లడించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/