భారీ వర్షాల ఎఫెక్ట్ : రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈరోజు , రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. కాకపోతే ఈ ప్రకటన చేసే లోపే స్కూల్ విద్యార్థులు, కాలేజ్ విద్యార్థులు తమ స్కూల్స్ , కాలేజీ లకు వెళ్లడం జరిగింది. ప్రస్తుతానికి విద్యాసంస్థలు కొనసాగుతుండగా..కుదిరితే మధ్యాహ్నం నుండి సెలవు ఇవ్వడమో , లేదా ఈరోజు ఇలాగే రన్ చేయడమో చేస్తారు. ఎందుకంటే ఓ పక్క వర్షం పడుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్ వద్ద డ్రాప్ చేసి వెళ్లిపోయారు. ఇప్పుడు సడెన్ గా స్కూల్ లేదు..అంటే మళ్లీ వర్షం లో రావడం , వర్షంలో పిల్లలు ఇంటికి వెళ్లడం ఇబ్బంది గా ఉంటుంది. అందుకే ఈరోజు ఇలాగే కొనసాగిస్తారు కావొచ్చు.

ఇక అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటలుగా ఎడతెరిపిలేని వర్షాలతో అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. జనగామ జిల్లా జాఫర్‌గఢ్‌లో అత్యధికంగా 18.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, యాదాద్రి జిల్లా రాజాపేట్‌లో 17.1 సెం.మీ., మెదక్‌ జిల్లా ఎల్దుర్తిలో 14.6 సెం.మీ., కుమ్రంభీం జిల్లా బెజ్జూర్‌లో 14.1 సెం.మీ., వరంగల్‌ జిల్లా పర్వతగిరిలో 13.9 సెం.మీ., సిద్దిపేట జిల్లా తొగులలో 13 సెం.మీ., భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లిలో 11.8 సెం.మీ., కామారెడ్డి జిల్లా గాంధారిలో 11.5 సెం.మీ., సంగారెడ్డి జిల్లా ఆందోలులో 11.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయిలో 9.4 సెం.మీ., మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తిలో 8.4 సెం.మీ., ములుగు జిల్లా వెంకటపురంలో 7.6 సెం.మీ., రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో 7.3 సెం.మీ., హైదరాబాద్‌ షేక్‌పేటలో 6.6 సెం.మీ., ఖైరతాబాద్‌లో 4.7 సెం.మీ., మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా కూకట్‌పల్లిలో 5.6 సెం.మీ., కుత్బుల్లాపూర్‌లో 4.7 సెం.మీ., సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో 4.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మరో నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.