పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్..

వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్తున్న గోదావరి ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ వద్ద గోదావరి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా క్షేమంగా ఉండడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. రైలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు.

ప్రమాదం కారణంగా గోదావరి ఎక్స్ ప్రెస్ అక్కడే నిలిచిపోవడంతో, ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాగా, పట్టాలు తప్పిన సమయంలో రైలు చాలా తక్కువ వేగంతో వెళుతున్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. బోగీలను తిరిగి పట్టాలపైకి ఎక్కించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రయాణికులను బస్సుల్లో వారి గమ్యస్థానాలకు పంపిచామన్నారు. కాగా, గోదావరి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య గోదావరి ఎక్స్‌ప్రెస్ (12727) రాకపోకలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ రైలు విశాఖలో సాయంత్రం 5.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.15 గంటలకు నాంపల్లి స్టేషన్‌కు చేరుకుటుంది.