జనసేన ను టెన్షన్ పెడుతున్న గాజు గ్లాసు సింబల్

మరో పది రోజుల్లో ఏపీలో ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో జనసేన శ్రేణుల్లో గాజు గ్లాసు సింబల్ టెన్షన్ పెడుతుంది. జనసేన పోటీచేసే రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే ఇతరులకు గాజుగ్లాసు గుర్తును కేటాయించబోమని.. ఆ పార్టీ బరిలోకి దిగిన 21 అసెంబ్లీ స్థానాలున్న లోక్‌సభ నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థులెవరికీ ఈ గుర్తు ఇవ్వొద్దని రిటర్నింగ్‌ అధికారు(ఆర్వో)లకు ఆదేశాలిచ్చామని ఈసీ బుధవారం హైకోర్టుకు నివేదించింది. కోర్టు దీనిపై విచారణను కూడా మూసివేసింది. అయితే ఈసీ నిర్ణయం తమ కూటమిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది.

టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున.. గాజుగ్లాసు గుర్తును ఇతర స్వతంత్ర అభ్యర్థులెవరికీ కేటాయించకుండా జనసేనకే రిజర్వ్‌ చేసేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య బుధవారమే అత్యవసరంగా పిటిషన్‌ దాఖలు చేశారు. టీడీపీ నేత వర్ల రామయ్య దాఖలు చేసిన ఈ పిటీషన్ ను ఈ రోజు హైకోర్టు విచారణ చేయనుంది. తమకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే కూటమి ఓట్ల బదిలీలో నష్టం జరిగే అవకావం ఉందని నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో, కోర్టు – ఎన్నికల సంఘం నిర్ణం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.