వీధి కుక్కల కట్టడికి GHMC కీలక నిర్ణయం

వీధి కుక్కల కట్టడికి GHMC కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల క్రితం పెద్ద అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ దాడి పట్ల స్థానికులు , ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు GHMC ఫై పలు విమర్శలు చేశారు. ఈ క్రమంలో GHMC కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్​తో పాటు శివారు మున్సిపాలిటీల పరిధిలో వీధికుక్కల బెడద నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యే క ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు.

కుక్కల సంతాన నియంత్రణ ప్రక్రియను వేగవంతం చేయాలని… ఫిర్యాదు చేయగానే చర్యలు తీసుకునే యంత్రాంగం ఉండాలని ఆదేశించారు. అలాగే, జీహెచ్‌ఎంసీ పరిధిలో వీధి కుక్కల బెడదపై 040 21111111 నంబరుకు ఫోన్‌ చేసిన వెంటనే తగిన చర్యలు తీసుకునేలా, మైజీహెచ్‌ఎంసీ యాప్‌ ద్వారానూ ఫిర్యాదులు స్వీకరించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు చేశారు. ఇక నగరంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీధి కుక్కల బెడద ఎక్కువై పోయింది. ఒంటరిగా కనిపిస్తే చాలు పిల్లలనే కాదు పెద్ద వారిపై కూడా దాడులు చేస్తున్నాయి. ఈ దాడులకు ఇప్పటికే ఎంతో మంది చనిపోయారు.