మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు

Madhya Pradesh Assembly Polls.. Violence Breaks Out In Dimani Constituency, 1 Injured

భోపాల్‌: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హింస చెలరేగింది. పోలింగ్‌ సందర్భంగా రెండు వర్గాల ప్రజలు రాళ్లు రువ్వుకున్నారు. ఈ సంఘటనలో ఒకరు గాయపడ్డారు. భద్రతా బలగాలు వెంటనే అక్కడకు చేరుకున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టాయి. మోరెనా జిల్లాలోని మిర్ఘన్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం డిమాని అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌లు 147, 148 వద్ద హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఇరు వర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. ఈ రాళ్ల దాడిలో ఒకరికి గాయాలయ్యాయి.

కాగా, భద్రతా సిబ్బంది వెంటనే ఆ పోలింగ్‌ బూత్‌ వద్దకు చేరుకున్నారు. లాఠీఛార్జ్‌ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని పోలీస్‌ అధికారులు తెలిపారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 2533 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మధ్యాహ్నం 1 గంట వరకు సుమారు 45 శాతం ఓటింగ్‌ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు.