సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో గ్యాస్ పేలుడు..

సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చేలరేగాయి. పక్కనే ఉన్న మరో రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఇంట్లోని సామాగ్రి మెుత్తం అగ్నికి ఆహుతైంది. అప్రమత్తమైన స్థానికులు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే సిలిండర్ పేలిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

రోజూ లాగానే లేచిన మహిళ వంట చేసేందుకు గ్యాస్‌ అంటించింది. అంతే ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ప్రజలు భయాందోళనతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు పెట్టారు. బయటకు వచ్చిన స్థానికులకు అరుపులు వినపడడంతో గ్యాస్‌ పేలిన ఇంటి వైపు పరుగులు పెట్టారు. అక్కడికి వెళ్లి చూడగా.. భారీగా మంటలు ఉవ్వెత్తున చెలరేగుతున్నాయి. కొందరు నీళ్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేపట్టారు.

అయితే పేలుడు ధాటికి ఇంటి పై కప్పు ఎగిసి పడింది. పక్కనే ఉన్న మరో ఇంటికి మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు, పొగ కమ్ముకుంది. స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నాలు చేసారు. ప్రమాద ఘటనపై పోలీసులు ఆరా తీశారు. సిలిండర్ పేలుడుకు కారణాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. నిజంగా ప్రమాదవశాత్తు జరిగిందా ? లేక మరేదైనా కారణమా ? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో పుట్టి దుర్గయ్య కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవటం.. వారంత గుడికి వెళ్లటంతో ఆ దేవుడే కాపాడాడని స్థానికులు అంటున్నారు. వారు ఇంట్లో ఉండి ఉంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేదని అంటున్నారు.