టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే గుండ్లూరు వీర‌శివారెడ్డి..?

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పార్టీల నేతలు ఇప్పటి నుండే ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. అధికార పార్టీ నుండి ప్రతిపక్షపార్టీ నేతల వరకు అంత కూడా ప్రతి రోజు ఆయా నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలకు దగ్గర అవుతున్నారు. కాగా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. పొత్తులు పెట్టుకొని అయినాసరే అధికారం దక్కించుకోవాలని అనుకుంటుంది. ఇదే క్రమంలో ఇతర పార్టీల నేతలు , మాజీ నేతలు సైతం టీడీపీ లో చేరేందుకు మొగ్గుచూపిస్తున్నారు. తాజాగా వైఎస్సార్ జిల్లాలో సీనియర్ రాజకీయ నేత, కమలాపురం మాజీ ఎమ్మెల్యే గుండ్లూరు వీర‌శివారెడ్డి టీడీపీ పార్టీలోచేరేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న కమలాపురంలో గత ఎన్నికల్లో.. వైసీపీకి మద్దతు ప్రకటించిన వీరశివరారెడ్డి పార్టీ మార్పు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసి ఆ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో వీరశివారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

అనంతరం వీరశివారెడ్డి మీడియా మాట్లాడుతూ.. వైఎస్సార్ జిల్లాలో రాజకీయ పరిస్థితులపై లోకేష్‌తో చర్చించినట్లు తెలిపారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆసక్తి లేదని, కానీ.. త్వరలో టీడీపీలో చేరతానని ప్రకటించారు. క‌డ‌ప జిల్లా క‌మ‌లాపురం నియోజకవర్గానికి చెందిన వీర‌శివారెడ్డి తొలుత టీడీపీతోనే రాజ‌కీయ ప్రస్థానం ప్రారంభించారు. 1994లో తొలిసారి టీడీపీ అభ్యర్థిగా క‌మ‌లాపురం నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. త‌ర్వాత 1999 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంవీ మైసూరారెడ్డి చేతిలో ఓట‌మిపాల‌య్యారు. 2004లో టీడీపీ అభ్యర్థిగా మ‌ళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే, 2009 ఎన్నిక‌ల నాటికి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. 2009 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా అక్కడి నుంచే గెలపొందారు. తర్వాత, ఏపీ పునర్విభజన, తదనంతర పరిణామాల నేపథ్యంలో 2014, 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు.