మోడీ ప్రభుత్వంపై శశిథరూర్ ప్రశంసలు..విమర్శలు

ఢిల్లీ డిక్లరేషన్ ద్వారా సభ్య దేశాలను ఏకతాటిపైకి తెచ్చారంటూ ప్రశంసలు

జీ20 విజయాన్ని బిజెపి తమ ఆస్తిగా మార్చుకునే ప్రయత్నం కూడా అని విమర్శ

G20 Summit..Delhi Declaration A .Diplomatic Triumph For India,. Says Shashi Tharoor

న్యూఢిల్లీః కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ ప్రధానమంత్రి నరేంద్రమోడీ పై ప్రశంసల వర్షం కురిపించారు. 18వ జీ20 శిఖరాగ్ర సదస్సు నిస్సందేహంగా భారత్ సాధించిన గొప్ప విజయమని కొనియాడారు. న్యూఢిల్లీ డిక్లరేషన్ ద్వారా సభ్యదేశాలన్నింటినీ మోదీ ప్రభుత్వం ఏకతాటిపైకి తీసుకొచ్చిందని ప్రశంసించారు. అయితే, అంతలోనే మోడీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ విజయం మోడీ ప్రభుత్వానికి ఆస్తిగా మారుతుందని విమర్శించారు.

ఢిల్లీ డిక్లరేషన్ నిస్సందేహంగా దేశానికి దౌత్యపరమైన విజయమేనన్న థరూర్.. జీ20 సదస్సుకు ముందు వరకు ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం సాధ్యం కాకపోవచ్చని అందరూ భావించారని, ఉమ్మడి ప్రకటన అసాధ్యమనే అందరూ అనుకున్నారని పేర్కొన్నారు. చైర్మన్ సారాంశంతో సదస్సు ముగుస్తుందని భావించారని ‘ఏఎన్ఐ’తో మాట్లాడుతూ థరూర్ చెప్పుకొచ్చారు.

ఏకాభిప్రాయం సాధించడంలో అమితాబ్‌కాంత్ కృషి ఎనలేనిదని గతంలో ప్రశంసించిన థరూర్.. రష్యా యుద్ధాన్ని ఖండించాలని కోరుకునే వారి మధ్య పెద్ద అగాధం ఉందని.. ఉక్రెయిన్, రష్యా, చైనా వంటి దేశాలు ఆ విషయం గురించి ప్రస్తావించకూడదనుకున్నాయని పేర్కొన్నారు. అయితే, ఆ అంతరాన్ని తగ్గించేందుకు భారత్ ఒక సూత్రం కనుగొందని, ఇది నిజంగా ఓ ముఖ్యమైన దౌత్య విజయమని అన్నారు. జీ20 సమ్మిట్‌ను ప్రభుత్వం ‘ప్రజల జీ20’గా మార్చిందని అంటూనే.. అధికారపార్టీ దీనిని తమకు ఆస్తిగా మార్చుకోవడానికి చేసిన ప్రయత్నం కూడా అని విమర్శించారు.