సనాతన ధర్మంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
భావ ప్రకటనా స్వేచ్ఛ విద్వేషపూరిత ప్రసంగంగా మారకూడదు.. న్యాయమూర్తి

చెన్నైః సనాతన ధర్మం పై డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో సనాతన ధర్మంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సనాతన ధర్మం అనేది దేశం, రాజు, తల్లిదండ్రులు, గురువు, పేదల పట్ల శ్రద్ధతో సహా నిత్య కర్తవ్యాల సమాహారమని వ్యాఖ్యానించింది.
తమిళనాడులోని తిరువారూర్ పట్టణంలోగల ఓ ప్రభుత్వ కాలేజీ ‘సనాతన వ్యతిరేకత’ అనే అంశంపై విద్యార్థులు తమ ఆలోచనలు పంచుకోవాలని ఓ సర్క్యూలర్ జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ ఇళంగోవన్ అనే వ్యక్తి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్ శేషసాయి ధర్మాసనం.. సనాతన ధర్మం కేవలం కులతత్వాన్ని, అంటరానితనాన్ని ప్రోత్సహించడమేనన్న భావన బలపడిందని అన్నారు. ఆ భావనను తాను గట్టిగా తిరస్కరిస్తున్నట్లు తెలిపారు.
‘సమాన పౌరులున్న సమాజంలో అంటరానితనాన్ని సహించలేము. సనాతన ధర్మంలో ఎక్కడో ఒక చోట అంటరానితనాన్ని అనుమతించినా.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిర్మూలిస్తుంది. వాక్ స్వాతంత్య్రం ప్రాథమిక హక్కు. అయితే, అది ద్వేషపూరిత ప్రసంగంగా మారకూడదు. ప్రతీ మతం విశ్వాసం ఆధారంగా స్థాపించబడింది. దాని స్వభావం ద్వారా విశ్వాసం అహేతుకతను కలిగి ఉంటుంది. కాబట్టి మతానికి సంబంధించిన విషయాల్లో భావ ప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించినప్పుడు ఎవరి మనసూ గాయపడకుండా చూసుకోవడం అవసరం. మరో మాటలో చెప్పాలంటే, భావ ప్రకటనా స్వేచ్ఛ విద్వేషపూరిత ప్రసంగంగా మారకూడదు’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
‘సనాతన ధర్మం’ డెంగీ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. మంత్రి వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఉదయనిధి మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని.. ఈ విషయంలో క్షమాపణలు చెప్పేదే లేదని తెగేసి చెబుతున్నారు.