23న ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ కమిటీ తొలి సమావేశం

First meeting of ‘One Nation, One Election’ committee to be held on September 23

న్యూఢిల్లీ: ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ విధానాన్ని పరిశీలించేందుకు ఏర్పాటైన కమిటీ తొలి అధికార సమావేశం సెప్టెంబర్ 23న జరుగనున్నది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలించనున్నారు. దీని కోసం రాజ్యాంగంలో చేయాల్సిన సవరణలు, సంబంధిత చట్టాల్లో మార్పులను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నారు.

కాగా, దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే జమిలి ఎన్నికల విధానాన్ని పరిశీలించేందుకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్‌, ఆర్థిక సంఘం మాజీ చైర్మన్‌ ఎన్‌కే సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సీ కశ్యప్, సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారీ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్‌ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరవుతారు. న్యాయ వ్యవహారాల కార్యదర్శి నితేన్ చంద్ర ఈ కమిటీకి కార్యదర్శిగా వ్యవహరిస్తారు.