నేడు కామారెడ్డికి బండి సంజయ్..

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నేడు కామారెడ్డి లో పర్యటించనున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రం మాస్టర్ ప్లాన్​కు వ్యతిరేకంగా నగర రైతులంతా ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. రైతుల ఆందోళనతో ప్రస్తుతం కామారెడ్డి లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ ఆందోళనను కొనసాగిస్తూ ఈరోజు కామారెడ్డి బంద్​కు పిలుపునిచ్చింది రైతు జేఏసీ. ఈ బంద్​కు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలపగా.. తాజాగా బీజేపీ కూడా తన సంఘీభావం ప్రకటించింది.

స్థానిక రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కామారెడ్డి టౌన్ లో వ్యాపార సంస్థలను మూసి వేయిస్తున్నారు. బందుకు మద్దతుగా విద్యాసంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. మరోవైపు కామారెడ్డి నియోజకవర్గం బీజేపీ ఇన్ చార్జ్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉదయమే పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయనను ఇంటి నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఇదిలా ఉంటె ఈరోజు మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర నాయకులతో కలిసి కామారెడ్డికి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి కామారెడ్డికి బండి సంజయ్ బయల్దేరి వెళ్లనున్నారు. అనంతరం ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన రైతు పయ్యావుల రాములు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.