బంజారాహిల్స్ లో దారుణం : నాలుగేళ్ల చిన్నారిపై ఆటో డ్రైవర్ అత్యాచారం

హైదరాబాద్ మహానగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల చిన్నారి ఫై ఓ ఆటో డ్రైవర్ అత్యాచారం చేసాడు. ఓ పక్క ప్రభుత్వాలు , పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్న సమాజం ఛీ కొడుతున్న సరే..కొంతమంది కామాంధుల్లో మార్పు రావడం లేదు. తమ కామ కోరిక తీర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. ఒంటరి మహిళా కనిపిస్తే చాలు వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అంతే కాదు అభం శుభం తెలియని చిన్నారులను కూడా వదలడం లేదు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో జరుగగా..తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ నాలుగేళ్ల చిన్నారి ఫై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.

బంజారాహిల్స్ పరిధిలోని ఓ ప్రాంతంలో ఓ నాలుగేళ్ల చిన్నారి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే ఈ చిన్నారి ఇటీవల రోడ్డుపై ఆడుకుంటూ ఉంది. ఆ చిన్నారిని గమనించిన ఓ ఆటో డ్రైవర్.. చాక్లెట్ ఇస్తానని ఆశ చూపి అభం, శుభం తెలియని ఆ బిడ్డను తన ఆటో ఎక్కించుకొని , ఆ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ దారుణాన్ని గమనించిన కొందరు స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ చిన్నారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.