విశ్వనాథ్ మృతి పట్ల చిరంజీవి, కమల్ హాసన్ తీవ్ర దిగ్బ్రాంతి

ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి విశ్వనాథ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 2 తేదీన (గురువారం) రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అపోలో ఆస్పత్రితో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విశ్వనాథ్ మృతి యావత్ అభిమానులు, సినీ ప్రముఖులు , రాజకీయ నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ విశ్వనాథ్ తో ఉన్న అనుబంధాన్ని వ్యక్తం చేస్తున్నారు.

విశ్వనాథ్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ”నా తెలుగు చిత్రాల స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన గొప్ప దర్శకులు విశ్వనాథ్ గారు. ఆయన కాలం చేయడం నన్ను కలచి వేసింది. ఈ రోజు ఆయన కన్నుమూసిన వార్త విని షాక్ కు గురి అయ్యాను. ఆయన లాంటి దర్శకుడు కన్ను మూయటం నాకే కాదు… తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు. ఈ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ఈ బాధను తట్టుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని సంతాపం వ్యక్తం చేశారు.

కమల్ హాసన్ :- ‘జీవిత పరమార్థం, కళలకు ఉండే అమరత్వం గురించి కె విశ్వనాథ్ గారు బాగా అర్థం చేసుకున్నారు. అందుకే కళాతపస్వి సృష్టించిన కళ.. ఆయన జీవితకాలానికి మించి మరణానంతరం కూడా వేడుకలా సాగుతుంది. కళలకు చావు లేదు’ అని విశ్వనాథ్ గారి గొప్పతనాన్ని వర్ణిస్తూ ట్వీట్ చేశారు. కమల్ హాసన్‌తో దర్శకుడిగానే కాక ‘శుభ సంకల్పం, ఉత్తమ విలన్’ చిత్రాల్లో నటుడిగానూ కలిసి పనిచేశారు విశ్వనాథ్. తన కెరీర్‌పై ప్రభావం చూపిన వ్యక్తుల్లో విశ్వనాథ్‌ కూడా ఒకరని కమల్ హాసన్ అనేక వేదికల్లో చెప్పిన విషయం తెలిసిందే. వీరి కలయికలో వచ్చిన ‘సాగర సంగమం, స్వాతి ముత్యం, శుభ సంకల్పం’ సూపర్ హిట్స్ సాధించాయి.

జూ. ఎన్టీఆర్ స్పందిస్తూ.. ”తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాధ్ గారిది ఉన్నతమైన స్థానం. ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’ లాంటి ఎన్నో అపురూపమైన చిత్రాలను మనకు అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ… ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

మమ్ముట్టి – ”శ్రీ కె. విశ్వనాథ్ గారి మరణ వార్త విని నేను తీవ్ర దిగ్బ్రాంతికి గురి అయ్యాను. ఆయన దర్శకత్వంలో ‘స్వాతి కిరణం’ చేయడం నాకు లభించిన అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను” అని మమ్ముట్టి ట్వీట్ చేశారు.

కె.విశ్వనాథ్ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ సమాచార,సినిమాటోగ్రఫీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. దర్శక దిగ్గాజాన్ని కోల్పవడం తెలుగు సినిమా పరిశ్రమకు తీరనిలోటని అన్నారు మంత్రి. విశ్వనాధ్ ఆత్మకు శాంతి చేకూరలని కోరారు.

కళాతపస్వి, దర్శకుడు శ్రీ కె విశ్వనాథ్ గారి మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. భారతీయ సాంసృతి సంప్రదాయాలను ప్రతిబింబించే చిత్రాలను తీసిన కళాతపస్వి విశ్వనాథ్ గారి మరణం చిత్ర పరిశ్రమకి తీరని లోటని అన్నారు. సామాజిక అంశాలను జోడించి తీసిన సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం నిలిచే ఉంటాయని వారి సేవల్ని కొనియాడారు. వారి కుటుంబానికి అభిమానులకి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

మరోపక్క కళాతపస్విని కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్‏లో ఆయన నివాసానికి చేరుకుంటూ ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఇక కె.విశ్వనాథ్ పార్థివ దేహానికి పంజాగుట్ట స్మశాన వాటికలో ఈరోజు మధ్యాహ్నం 11 గంటల 30 నిమిషాలకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు.