ప్రారంభమైన హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్‌..

హైదరాబాద్ లో ఫార్ములా ఈ కార్ రేస్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. హుస్సేన్‌సాగర్‌ తీరంలోని ఎన్టీఆర్‌ మార్గ్‌ ఈ-కార్ల రేసుతో సందడిగా మారింది. ప్రధాన రేసుకు ముందు ప్రాక్టీస్‌ రేసులు నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా రెండో ప్రీ ప్రాక్టీస్‌ రేటు ప్రారంభమైంది. 30 నిమిషాలపాటు ప్రాక్టీస్‌ కొనసాగనుంది. ఇక ఉదయం 10.40 గంటలకు అర్హత పోటీలు నిర్వహించనున్నారు. అందులో క్వాలిఫై అయిన రేసర్లు.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన రేసులో చాంపియన్‌షిప్‌ కోసం తలపడనున్నారు. ఈ రేస్‌ను చూసేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా రేసింగ్ అభిమానులు వచ్చారు.

ఇక ఈ రేసుకు భారీ ఏర్పాట్లు కూడా చేశారు నిర్వహకులు. ఒకేసారి 21 వేల మంది చూసేందుకు తగిన సదుపాయాలను కల్పించారు. 2.8 కిలోమీటర్ల సర్క్యూట్‌పై మొత్తం 11 జట్ల కింద.. 22 మంది రేసర్లు ఇవాళ రేసులో పాల్గొంటారు. ఇందులో గంటకు 322 కిలోమీటర్ల హై స్పీడ్ తో దూసుకెళ్లే ఫార్ములా కార్లు(జెన్‌3 కార్లు) పరుగులు తీయనున్నాయి. మరో విశేషమేమంటే.. ఈ రేసులో విదేశీ కంపెనీలు, రేసర్లతోపాటూ.. భారత్‌ నుంచి మహీంద్ర రేసింగ్‌, టీసీఎస్‌ జాగ్వార్‌ కూడా ఉన్నాయి. అయితే ఈ ఫార్ములా రేస్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. 2013లో జరిగిన ఫార్ములా-1 రేసు తర్వాత.. భారత్‌లో తొలిసారిగా ఈ రేస్ జరుగుతోంది. అందులోనూ హైదరాబాద్‌లో జరుగుతుండటం తెలుగు రాష్ట్రాల ప్రత్యేకం అనుకోవచ్చు.