ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు : వైస్సార్సీపీ ఎంపీ కుమారుడు అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ ల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువుర్ని అదుపులోకి తీసుకున్న ఈడీ..తాజాగా వైస్సార్సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి తనయుడు మాగుంట రాఘవను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ కేసులో ఈడీ రాఘవను ఇప్పటికే పలుసార్లు విచారించడం జరిగింది. రాఘవ బాలాజీ గ్రూప్ చైర్మన్ గా ఉన్నారు. సౌత్ గ్రూప్లో రాఘవ కీ రోల్ పోషించినట్లు తెలుస్తోంది.

గత ఏడాది ఆగష్టు చివర్లో ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం వెలుగు చూసిన తర్వాత సిబిఐ ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో పలువురిని ప్రశ్నించే క్రమంలో హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ కుమార్తె పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే కవితకు వ్యక్తిగత ఆడిటర్‌గా పనిచేస్తున్న గోరంట్ల బుచ్చిబాబు పేరు తెరపైకి వచ్చింది. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో గత వారంలో సిబిఐ దాఖలు చేసిన అభియోగాల్లో ఎమ్మెల్సీ కవితతో పాటు ఏపీకి చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పేరిట చక్రం తిప్పడంలో పలువురు ప్రముఖులు కీలక పాత్ర పోషించారని, వ్యాపార ప్రయోజనాలు పొందడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జీషీట్లలో పలువురి పేర్లను ప్రధానంగా ప్రస్తావించింది.