ఎలక్టోరల్ బాండ్లపై చిదంబరం కీలక వ్యాఖ్యలు

త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు

Chidambaram
Chidambaram

న్యూఢిల్లీః త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, దేశంలో 28వ సారి ఎలక్టోరల్ బాండ్ల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే, కేంద్రం నిర్ణయంపై కాంగ్రెస్ అగ్రనేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలక్టోరల్ బాండ్లను చట్టబద్ధమైన లంచంతో పోల్చారు. ఎలక్టోరల్ బాండ్ల జారీ బిజెపికే లాభిస్తుందని, ఆ పార్టీకి ఎలక్టోరల్ బాండ్లతో బంగారుపంట పండనుందని అన్నారు. గత రికార్డుల పరిశీలించి చూస్తే ఎలక్టోరల్ బ్యాండ్లలో 90 శాతం వరకు బిజెపికే లబ్ది చేకూరిందని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్ల విడుదల నేపథ్యంలో, ఓ వర్గం పెట్టుబడిదారులు చెక్ బుక్ లను తెరిచి ఉంచి ఢిల్లీలో ఉన్న తమ ‘మాస్టర్’ కోసం సంతకాలు చేయడమే తరువాయి అని చిదంబరం వ్యాఖ్యానించారు.

కాగా, అక్టోబరు 4 నుంచి 13వ తేదీ వరకు ఎలక్టోరల్ బాండ్లను జారీ చేయనున్నట్టు కేంద్రం ఇటీవల ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐకి చెందిన అన్ని బ్రాంచిల్లో ఈ ఎలక్టోరల్ బాండ్లను విక్రయించనున్నారు.