జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించిన సీబీఐ మాజీ జేడీ

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పేరుతో సరికొత్త పార్టీని స్థాపించారు. సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. రాజకీయాలు అంటే సుపరిపాలన అని నిరూపిస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందన్న జేడీ.. అవినీతిని నిర్మూలించి.. బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకే తమ జై భారత్‌ నేషనల్‌ పార్టీ వచ్చిందని ఆయన అన్నారు. అభివృద్ధితో అవసరాలు ఎలా తీర్చుకోవాలే తమ పార్టీ చేసి చూపుతుందని జేడీ చెప్పుకొచ్చారు. రాజకీయాలన్నీ కుటుంబపాలన చూట్టే తిరుగుతున్నాయని..ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయని మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.

చీకటిలో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపడంతోపాటు ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడానికి పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ అని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. తాము తప్పు చేయం.. అప్పు చేయమని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఏపీ అనేది వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని… ఇక్కడే అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.

ఐపీఎస్ కు స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ప్రజల మధ్యకు వచ్చానని తెలిపారు. అనేక వర్గాల ప్రజలను కలుసుకుంటూ, వారి సమస్యలను అవగాహన చేసుకుంటూ ముందుకు సాగుతున్నానని వివరించారు. సమస్యలు, పరిష్కారాలను వారినే అడిగి తెలుసుకుంటూ, రాష్ట్రం మొత్తం తిరిగి చేసిన అధ్యయనంతో రాజ్యాధికారం ముఖ్యమన్న విషయాన్ని గుర్తించానని వెల్లడించారు. ఆ విధంగా 2019 ఎన్నికల్లో పోటీ చేశానని, 3 లక్షల మంది వరకు ఓటర్లు మద్దతు పలికారని వివరించారు.

“ఆ ఎన్నికల తర్వాత కూడా రాష్ట్రంలో పర్యటిస్తూ యువతను, రైతులను, కార్మికులను, మత్స్యకారులను కలిసిన తర్వాత వాళ్ల ఆలోచనలు, వాళ్ల ఆకాంక్షలు పరిశీలించాను. ఒక పార్టీ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలని స్థాపించిన పార్టీ ఇది. ఇది పెట్టిన పార్టీ కాదు… ప్రజల కాంక్షలు, ఆకాంక్షలు, ఆలోచనల్లోంచి పుట్టిన పార్టీ… జై భారత్ నేషనల్ పార్టీ. మనదేశంలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు మీ అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. రాజకీయాలంటే ప్రజలను మోసగించడమే అని అందరూ భావిస్తున్న పరిస్థితుల్లో… రాజకీయాలంటే సుపరిపాలన అని చాటిచెప్పడానికే జై భారత్ పార్టీతో ముందుకు వస్తున్నాం అని తెలిపారు.