జనగామ జిల్లాలో ఎండిన పంటను పరిశీలించిన కేసీఆర్

బిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈరోజు ఆదివారం జనగాం జిల్లాలో పర్యటించారు. రైతుకు బాసటగా నిలిచేందుకు..అన్నదాతకు అండగా నిలిచేందుకు పొలంబాట పట్టారు. ఇందులో భాగంగా నేడు జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో పర్యటిస్తూ రైతుల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఉదయం ఎర్రవల్లి వ్యవక్షేత్రం నుంచి రోడ్డు మార్గాన దేవరుప్పల మండలం ధరావత్‌తండాకు చేరుకున్నారు. అక్కడ ఎండిపోయిన పొలాలను పరిశీలించి, రైతుల సమస్యలు తెలుసుకుంటున్నారు. అనంతరం సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తితో పాటు అర్వపల్లి, సూర్యాపేట మండలంలో ఎండిన పంటలను పరిశీలించి, మధ్యాహ్నం ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు.

అక్కడే మధ్యాహ్న భోజనం చేసి, 3 గంటలకు మీడియా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం 3.30 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి సాయంత్రం 4.30 గంటలకు నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని నిడమనూరుకు చేరుకుంటారు. అక్కడ పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడుతారు. సాయంత్రం ఆరు గంటలకు బయల్దేరి నల్లగొండ మీదుగా రాత్రి 9 గంటలకు ఎర్రవల్లి చేరుకుంటారు.