జూరాల ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద

ఒక్క రోజులోనే 18 వేల నుంచి 63 వేల క్యూసెక్కులకు పెరిగిన జూరాల నీటి మట్టం

మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతున్నది. వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో ప్రవాహం పెరుగుతుండడంతో ఎగువ ప్రాంతాల్లోని ప్రాజెక్టుల నుంచి జూరాలకు వరద ప్రవాహం పెరుగుతోంది. జూరాల జలాశయంలో గురువారం రాత్రి 18 వేల క్యూసెక్కుల నీరు ఉండగా ఒక్క రోజులోనే అది ఏకంగా 63 వేలకు పెరగడం గమనార్హం. దీంతో అక్కడి నుంచి శ్రీశైలానికి 35వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద ప్రవాహంలో 8,238 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరిలో శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు నిన్న ఉదయం వరకు 1.17 లక్షల క్యూసెక్కులు రాగా, సాయంత్రానికి అది 9,876 క్యూసెక్కులకు తగ్గింది. కడెం ప్రాజెక్టు నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి 32 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. కాళేశ్వరంలోని లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజీ నుంచి 41 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక గోదావరిలో ధవళేశ్వరం నుంచి 1.12 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/