ఖమ్మం జిల్లాలో బయటపడ్డ టీఆర్‌ఎస్‌ గ్రూపు రాజకీయాలు..అసంతృప్తితో తుమ్మల

మరోసారి ఖమ్మం జిల్లాలోని టిఆర్ఎస్ పార్టీ వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఖమ్మం జిల్లా నుంచి వద్దిరాజు రవిచంద్ర, డాక్టర్ బండి పార్థసారథిరెడ్డిలకు రాజ్యసభ పదవి ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ సత్తుపల్లిలో శుక్రవారం టీఆర్ఎస్ సమావేశం నిర్వహించింది. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన ఈ కృతజ్ఞత సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, జిల్లా మంత్రి పువ్వాడ శ్రీనివాసరావు ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.

ఈ కీలకసభకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటికి పార్టీ తరఫున ఆహ్వానం అందలేదు. ఇంత పెద్దయెత్తున పార్టీ ప్రోగ్రాం జరిగినా కీలక నేతలు తుమ్మల, పొంగులేటి రాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఎంపీ పార్ధసారధిరెడ్డి ఆహ్వానించినా పార్టీ పరంగా జిల్లా నేతలు తనను ఆహ్వానించకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు తుమ్మల.

సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే లేదా జిల్లా అధ్యక్షుడి నుంచి తనకు ఆహ్వానం అందలేదని తుమ్మల తెలిపారు. ఈ సమావేశానికి ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ పిడమర్తి రవిని కూడా ఆహ్వానించలేదని తెలుస్తోంది. ఇక ఈరోజు శనివారం సత్తుపల్లి వెళ్లి పార్ధసారధి రెడ్డిని కలిసి అభినందించారు తుమ్మల. ఈ సందర్భంగానే వారి మధ్య నిన్నటి సభపై చర్చ జరిగింది. అప్పుడే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు తుమ్మల నాగేశ్వరరావు. పార్టీ పరంగా పిలుస్తారని అనుకున్నా పిలవలేదని, అందుకే తాను రాలేదని చెప్పుకొచ్చారు.

గత కొంతకాలంగా తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్నారని, బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారనే వార్తలు జోరుగా వినిపించాయి. కానీ ఇటీవల తన అనుచరులతో నిర్వహించిన సమావేశంలో తాను పార్టీ మారేది లేదని, సీఎం కేసీఆర్ వెంటే నడుస్తానంటూ చెప్పుకొచ్చారు.