అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు
first-death-from-omicron-variant-in-america
వాషింగ్టన్ : దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే ఒమిక్రాన్ 90కి పైగా దేశాల్లో విస్తరించింది. అమెరికాలో ఒమిక్రాన్ కారణంగా మొదటి మరణం నమోదైంది. టెక్సాస్‌లోని హారిస్ కౌంటిలో సోమవారం ఓ వ్యక్తి మరణించినట్లు కౌంటీ ఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే, సదరు వ్యక్తి ఇప్పటి వరకు టీకా తీసుకోలేదని, అతని వయసు 50 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉంటుందని ఏబీసీ న్యూస్ వెల్లడించింది. ఇంతకు అతడు రెండు సార్లు కొవిడ్ బారినపడ్డట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. కౌంటీ మెజిస్ట్రేట్ లీనా హిడ్గాలో కరోనా కొత్త వేరియంట్ కారణంగా ఒకరు మృతి చెందారని, ఇదే ఒమిక్రాన్ కారణంగా నమోదైన తొలి మరణమని ట్వీట్ చేశారు.
మరో వైపు ఒమిక్రాన్ వేరియంట్ అమెరికాలో విజృంభిస్తున్నది. ఈ నెల 18తో పూర్తయిన వీక్లీ సీక్వెన్సింగ్ డేటా ఆధారంగా అమెరికాలో కరోనా కేసుల్లో 73శాతం ఒమిక్రాన్ వేరియంటే కారణమని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సోమవారం పేర్కొంది. ఇంతకు ముందు బ్రిటన్‌లో తొలి మరణం నమోదవగా.. ఇప్పటి వరకు 12 మంది మృత్యువాతపడ్డారు. 104 మంది వరకు ప్రస్తుతం ఆసుపత్రిలో చేరినట్లు బ్రిటన్ ఉప ప్రధాని డొమినిక్ రాబ్ పేర్కొన్నారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/