కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై కేసు నమోదు

firs-against-digvijaya-singh-for-sharing-controversial-post-on-ex-rss-chief-golwalkar

న్యూఢిల్లీః రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్సెస్) మాజీ చీఫ్ ఎంఎస్ గోవల్కర్ పై సోషల్ మీడియాలో అనుచిత పోస్ట్ పెట్టారన్న ఫిర్యాదుతో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై కేసు నమోదైంది. మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఇందౌర్ పోలీసు అధికారి తెలిపారు. లాయర్, ఆర్ఎస్సెస్ కార్యకర్త రాజేశ్ జోషీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దిగ్విజయ్ సింగ్ పై పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. దళితులు, ముస్లింలు, హిందువుల మధ్య చిచ్చుపెట్టేందుకు దిగ్విజయ్ సింగ్ ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు.

కాగా, ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. కాంగ్రెస్ నేతలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసి, సమాజాన్ని విభజించాలని ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. అయితే, బిజెపి తన అధికార బలాన్ని ఉపయోగించి ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందంటూ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక పుస్తకం ఆధారంగా దిగ్విజయ్ సింగ్ ఆ పోస్టు పెట్టారని తెలిపింది. ఎంత ప్రయత్నించినా బిజెపి తమ గొంతు నొక్కలేదని స్పష్టం చేసింది.