సీఎం జగన్‌ను కలిసిన నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌

అమరావతి : నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎంతో భేటీ అయ్యారు. రెండు రోజుల పాటు ఏపీలో జరిగే వివిధ కార్యక్రమాలలో నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్, నీతి ఆయోగ్‌ బృందం పాల్గొననున్నారు. అంతకుముందు… కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం వీరపనేనిగూడెంలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను రాజీవ్ కుమార్‌తో కూడిన నీతి ఆయోగ్ బృందం పరిశీలించనుంది. వీరపనేని గూడెంలో బి.సతీష్ రెడ్డి అనే రైతుకు చెందిన వరి పొలాన్ని పరిశీలించారు.

రసాయనాలు వాడకుండా వరిసాగు చేసిన విధానాన్ని డా.రాజీవ్ కుమార్ నేతృత్వంలోని నీతి ఆయోగ్ బృందం అడిగి తెలుసుకున్నారు. వీరపనేనిగూడెం గ్రామ సచివాలయాన్ని నీతి ఆయోగ్ బృందం సందర్శించింది. గ్రామ సచివాలయం పనితీరును జిల్లా కలెక్టర్ జె.నివాస్ నీతి ఆయోగ్ బృందానికి వివరించారు. నీతి ఆయోగ్ బృందానికి సేంద్రీయ పద్ధతిలో పండించిన పంటలతో తయారు చేసిన ఆహారపదార్ధాలను వీరపనేని గూడెం గ్రామస్తులు అందజేశారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ డా.రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. వీరపనేని గూడెం గ్రామస్తులుప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం నిజంగా అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాగే మరింత మంది ప్రకృతి వ్యవసాయం వైపు అగుడులేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/