మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రారంభం

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రారంభమైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీగా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. 1439 ఓటర్ల కోసం జిల్లాలో 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల పరిధిలోని ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, పురపాలక కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

వీరితోపాటు ఎక్స్‌ అఫీషియో హోదాలో ఉమ్మడి జిల్లా పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలతోపాటు ముగ్గురు ఎమ్మెల్సీలు మొత్తంగా 1,439 మంది ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని కొడంగల్‌ నియోజకవర్గం నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఎక్స్‌ అఫీషియోగా కొడంగల్‌లో రేవంత్ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఏప్రిల్ 2న ఓట్లు లెక్కిస్తారు.