ప్రాణం తీసిన ‘ఎలుగుబంటి’ని పట్టుకున్న అధికారులు

శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలోని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత వారం రోజులుగా ఎలుగుబంటి ప్రజలను నిద్రపోనివ్వడం లేదు..పొలం పనులు చేసుకోనివ్వడం లేదు. దీని దాడికి అనేక పశువులు గాయపడగా..ఆదివారం ఏకంగా ఎనిమిది మంది గాయపడ్డారు. కిడిసింగి-వజ్రపుకొత్తూరు మధ్య జీడి, కొబ్బరితోటల్లో పనిచేస్తున్న 8 మంది రైతులపై ఎలుగుబటి దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు.

వీరిలో ఒకరు చనిపోగా..మరో నలుగురి పరిస్థితి ఆందోళనకారణంగా ఉంది. ఈ ఘటనఫై స్పందించిన అటవీశాఖ అధికారులు.. ఎలుగుబంటి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఓ ఇంటి ఆవరణలో ఎలుగుబంటి ఉన్నట్లు గుర్తించారు. ఎలుగుబంటిని పట్టుకోవటానికి అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టి దానిని అధికారులు ప్రాణాలతో పట్టుకున్నారు. మత్తు ఇంజక్షన్‌ ఇచ్చిన రెస్క్యూ టీమ్‌.. చివరకు దానిని సజీవంగా పట్టుకుంది. ఆ ఎలుగుబంటిని యానిమల్‌ రెస్క్యూ సెంటర్‌కి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. నిన్నటి నుంచి కిడిసింగి శారదా పురం తోటలో నివసిస్తున్న ప్రజల్ని ఎలుగుబంటి భయభ్రాంతులకు గురిచేసింది.