బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకకు హాజరైన ఇమామ్ ఉమర్ ఇల్యాసిపై ఫత్వా జారీ

తనను బాయ్‌కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో ఇతర ఇమామ్‌లను కోరినట్టు వెల్లడి

Fatwa issued against Imam Umer Ilyasi over attending Ram Temple Pran Pratishtha ceremony

న్యూఢిల్లీః అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లిన తనకు ఫత్వా జారీ అయ్యిందని ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్‌యాసీ తెలిపారు. రామమందిర ప్రారంభోత్సవానికి దేశవ్యాప్తంగా వివిధ రంగాల ప్రముఖులు హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాబ్రీ మసీదు కేసులో పిటిషనర్‌గా ఉన్న ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్‌యాసీ కూడా హాజరయ్యారు.

అయితే, రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లినందుకు తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని, ఒక వర్గం తనపై దూషణభూషణలకు దిగిందని ఇల్‌యాసీ తెలిపారు. తన ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో షేర్ చేశారని, ఇతర మసీదు అథారిటీలు, ఇమామ్‌లను తనను బాయ్‌కాయ్ చేయాల్సిందిగా కోరారని ఆయన చెప్పరు. తనకు రామ జన్మభూమి ట్రస్టు నుంచి ఆహ్వానం వచ్చిందని, దాంతో వెళ్లానని ఆయన తెలిపారు. ఈ నిర్ణయం తన జీవితంలో అతిపెద్దదని చెప్పుకొచ్చారు.

తనకు కొందరు వ్యక్తిగతంగా ఫత్వా జారీ చేశారని, అలా చేసే అధికారం ఎవరికీ లేదని ఇమామ్ ఉమర్ ఇల్‌యాసీ స్పష్టం చేశారు. ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం పురోగమిస్తోందన్నారు. భారత్ విశ్వగురు కావడానికి చేస్తున్న ప్రయాణంలో దేశప్రజలంతా బలంగా ఒకటిగా ఉండాలన్నారు. ప్రస్తుతం దేశం భిన్నత్వంలో ఏకత్వం గల సర్వ ధర్మ సంభవ్ భారత్ అని వ్యాఖ్యానించారు. అందరి దేశమైన భారత్ గొప్పదని చెప్పారు.