పాతబస్తీలో మరికొంతమందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

పాతబస్తీలో ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల ఫై ఎంఐఎం కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. మహ్మద్ ప్రవక్తపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఎంఐఎం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజాసింగ్‌ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేయగా..బెయిల్ ఫై విడుదల అయ్యారు. తాను విడుదలైన తర్వాత మరిన్ని వీడియోలు పోస్ట్ చేస్తానని రాజాసింగ్ పేర్కొనడంతో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఒక వర్గానికి చెందిన యువత రోడ్లపైకి చేరుకున్నారు.

చార్మినార్‌, మదీన, చంద్రాయణగుట్ట, బార్కాస్‌, సిటీ కాలేజ్‌ తదితర ప్రాంతాల్లో… వందల సంఖ్యలో రోడ్లపై చేరి రాజాసింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్లజెండాలను చేత పట్టుకుని నిరసన తెలిపారు. మదీన, అఫ్జల్‌గంజ్‌, చార్మినార్‌ కూడలిలో గుంపులుగా చేరిన పలువురు… కూడళ్ల వద్ద వాహనాలను నిలిపి నినాదాలు చేశారు. ఆయా ప్రాంతాల్లో నల్లజెండాలతో నిరసన ర్యాలీ చేశారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున చేరుకొని.. ఆందోళనకారులు విధ్యంసానికి పాల్పడకుండా చర్యలు చేపట్టారు. పాతబస్తీలోని పలుప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులను మోహరించారు. సోషల్ మీడియా లో పలు వార్తలు బయటకు రావడంతో వాటిని నమ్మొద్దని పోలీసులు తెలిపారు. ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సాయంత్రం ర్యాలీగా వచ్చిన 20 మంది ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. పాతబస్తీ సహా దక్షిణ మండలంలో మద్యం, పాన్ షాపులు, దుకాణాలు, హోటళ్లు రాత్రి 8గంటలకే మూసి వేయాలని పోలీసులు ఆదేశించడంతో అంత షాపులు బంద్ చేసారు. రాత్రి కూడా పోలీసు అదనపు బలగాలు పాత బస్తీ పరిసర ప్రాంతాల్లో పహారా కాయనున్నాయి.