ఏపీలో కుల గణన గడువు పొడిగింపు

ఏపీలో కుల గణన ప్రక్రియను ఫిబ్రవరి 4 వరకు పొడిగించారు. ఈ కార్యక్రమం ఈ నెల 19న ప్రారంభించగా.. ఈ నెల 29 నాటికి పూర్తి చేయాలని తొలుత నిర్ణయించారు. అయితే యాప్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అందరి వివరాలు నమోదు చేయలేకపోయారు. మిగిలిన కుటుంబాల వివరాలు నమోదు చేసేందుకు ఫిబ్రవరి 4 వరకు పొడిగించారు. గడువు తర్వాత కూడా నమోదు చేయకపోతే ఫిబ్రవరి 7లోగా నేరుగా గ్రామ/వార్డు సచివాలయాలకు వెళ్లి నమోదు చేసుకోవచ్చు.

కులగణన ప్రక్రియకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి కుల, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సర్వే చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం…ఆ మేరకు ఇంటికిఇంటికి వెళ్లి సర్వే చేస్తూ వస్తుంది. 1.67 కోట్ల కుటుంబాల్లో 4.89 కోట్ల మంది ప్రజలు ఉండగా, ఇప్పటి వరకు 1.33 కోట్ల కుటుంబాల్లోని 3.39 కోట్ల మంది వివరాలను గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నమోదు చేశారు. మొత్తంగా 79.59 శాతం కుటుంబాల్లో కుల గణన పూర్తయ్యింది.

గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 20కి పైగా అంశాలపై సమాచారం సేకరించనున్నారు. సర్వే కోసం వాలంటీర్లు ఇళ్లకు వచ్చిన సమయంలో ఇంటికి తాళం వేసి ఉన్నా.. కుటుంబ సభ్యులు ఇళ్ల దగ్గర లేకపోయినా వారి వివరాల నమోదు కోసం సర్వే పూర్తయిన వివరాల నమోదుకు తరువాత మరో వారం గడువు ఇవ్వనున్నారు. ఆ సమయంలో సంబంధిత కుటుంబసభ్యులే సచివాలయాలకు వెళ్లి వివరాలు అందించాలి.

కుల గణన సర్వే వివరాల నమోదుకు వాలంటీర్ల సెల్‌ఫోన్లలో ప్రత్యేక యాప్ ఇన్‌స్టాల్ చేసారు. సర్వే ప్రారంభం నుంచి ముగింపు వరకు వాలంటీర్లు ఒకే ఫోన్ వినియోగించాల్సి ఉంటుంది. సర్వేలో భాగంగా కుటుంబాల నుంచి వివరాలు సేకరించేటప్పుడు, సర్వే పూర్తి అయిన తరువాత స్క్రీన్ షాట్ తీయకుండా యాప్‌లో డిజైన్ చేశారు.